దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘నిర్భయ’ దారుణ సామూహిక అత్యాచారం కేసులో నలుగురు నిందితులు.. ముఖేశ్, పవన్ గుప్తా, వినయ్‌శర్మ, అక్షయ్ ఠాకూర్లకు ఉరిశిక్ష విధించారు. వీరు నలుగురిని మంగళవారమే దోషులుగా నిర్ధారించినా, శిక్షను మాత్రం శుక్రవారానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే.
కిక్కిరిసిన కోర్టు హాల్లో అత్యంత ఉత్కంఠ నడుమ వీరు నలుగురికి ఉరిశిక్ష విధిస్తూ.. అదనపు సెషన్స్ జడ్జి యోగేశ్ ఖన్నా తీర్పు వెలువరించారు. నిందితులు నలుగురిపై 13 సెక్షన్ల కింద అభియోగాలు నమోదయ్యాయి. 84 మంది సాక్షులను ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపారు. వీరిపై హత్య, అత్యాచారం, కిడ్నాప్ నేరాలు నిర్ధారణ అయ్యాయి. అయితే, తీర్పుపై హైకోర్టులో సవాలుచేస్తామని దోషుల తరఫు న్యాయవాది తెలిపారు.